-తెలంగాణను ఇచ్చేవాళ్లు ఇక్కడున్నారు:ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్
-చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం
-మేమిచ్చిన మూడు రాష్ట్రాలే నిదర్శనం:బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు
-సంతోషంగా విడిపోదాం: కిషన్‌డ్డి
-రాష్ట్రం సాధించే బాధ్యత యువతరానిదే:తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని బీజేపీ నేతలు ఉద్ఘాటించారు. తెలంగాణ సాధనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ అయిన బీజేపీతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కల సాకారమవుతుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌డ్డి ఇటీవల నిర్వహించిన బీజేపీ తెలంగాణ పోరు యాత్ర ముగింపును పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో ఆ పార్టీ అధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ‘‘హర్‌జవాన్ బన్‌గయా దివానా... ఛత్తీస్‌గఢ్ బన్‌జాయేగా తెలంగాణ’’ అంటూ పవన్ దివాన్ రాసిన కవితనే తమకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ‘‘తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వకపోతే, తెలంగాణ ఇచ్చే వాళ్లు ఇక్కడ కూర్చున్నారు’’ అని ఆయన ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతనే ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి పథాన పయనిస్తోందని గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణ ఉద్యమం ఆగిపోయిందని కలగంటున్న ప్రభుత్వానికి ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నదనని తెలంగాణ పోరుయాత్ర సంకేతాలను పంపిందని బీజేపీ జాతీయ నేత ఎం వెంకయ్యనాయుడు అన్నారు.
తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. గతంలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినట్లే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని పునరుద్ఘాటించారు. ‘‘తెలంగాణ విషయంలో బీజేపీది ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే చూపు, ఒకటే నాలుక. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేవరకూ ఉద్యమిస్తాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి స్పష్టం చేశారు. ‘‘సమైక్య రాష్ట్రంలో రెండు ప్రాంతాల వారు కలహాల కాపురం చేస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ కారణంగా ప్రజల్లో విద్వేషాలు నెలకొన్నాయి.
అనుమానాలు పెరిగాయి. ఇవన్నీ వద్దు సంతోషంగా విడిపోదాం. గుజరాత్‌లా, ఛత్తీస్‌గఢ్‌లా తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యం’’ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భవిష్యత్‌లో జరిగే పోరాటానికి శంఖారావం పూరిస్తున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. ఉద్యమాన్ని నడిపి తెలంగాణను సాధించే బాధ్యత యువతరానిదే అని ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే తెలంగాణ ఉద్యమంలో 9.5 లక్షల మంది ఉద్యోగులు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ‘‘ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 700 మందికి పైగా ఆత్మాహుతి చేసుకున్నారు. వీరి ప్రాణాలకన్నా.. మా ఉద్యోగాలు గొప్పవేం కావు’’ అని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కంటే ఏది ముఖ్యం కాదని తేల్చి చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి