బతికిన మనుషులు 'బతుకమ్మ'(నమస్తే తెలంగాణా) సౌజన్యం తో
సువర్ణ
మలి తెలంగాణ ఉద్యమంలో అమరురాలైన తొలి విద్యార్థిని ఈ పాలమూరు బిడ్డ.వచ్చిన తెలంగాణను ఆపడానికి సీమాంధ్ర రాజకీయ నాయకులు రాజీనామాలతో కపట నాటకాన్ని ఆరంభించారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సువర్ణ వారి డ్రామాలు చూడలేక పాణమిడిసింది.సువర్ణది పాలమూరు జిల్లా కొత్తకోట మండలంలోని మిరాసిపల్లి. తండ్రి కావలి నర్సన్న, తల్లి రాములమ్మ. వీళ్ల ఐదుగురు సంతానంలో సువర్ణ నాలుగో సంతానం.
పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సువర్ణ కొత్తకోటలోని నివేదిత డిగ్రీ కాలేజీలో బీఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతుండేది. చిన్నప్పటి నుంచి సువర్ణ తక్కువగా మాట్లాడేది. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంటిపనుల్లో నిమగ్నమయ్యేది. సెలవు రోజుల్లో తమ్ముడు రాధాకృష్ణతో కలిసి సెలక దగ్గరికి పోయి వ్యవసాయ పనులు చేసేది.
రాఖీ పండుగంటే సువర్ణకు చాలా ఇష్టం. అన్నదమ్ములకు రాఖీ కట్టి దీవెనలు తీసుకునేది. పండుగలు పబ్బాలు వస్తే ఇక ఆ రోజుల్లో తిండి తిప్పలు మానేసి ఇంటి అలంకరణ, వంట పనుల్లో పడిపోయేది.
సువర్ణ మలి తెలంగాణ ఉద్యమాన్ని దగ్గరి నుంచి చూసింది. వలసవాదులు తెలంగాణను ఏ విధంగా దోచుకున్నరో తెలుసుకున్నది. తోటి విద్యార్థినిలతో కలిసి ధర్నాల్లో, రాస్తారోకోల్లో పాల్గొనేది. నిత్యం తెలంగాణ గురించి మిత్రులతో చర్చించేది. తెలంగాణకు ఆంధ్రపాలక వర్గం అడ్డుపడుతున్న వైనం చూసి కలత చెందేది.
అన్నట్టు, సువర్ణ మంచి గాయకురాలు. సమయం దొరికితే చాలు, తెలంగాణ ఆట, పాటల్లో పాలుపంచుకుని తన తడాఖా చూపేది.
డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేయంగనే ఇక మన కష్టాలన్నీ తీరాయని ఎంతో సంతోషించింది. తెలంగాణ వచ్చినట్టే అనుకుని ఆనందంగా తోటి విద్యార్థినులకు స్వీట్లు పంచింది. అంతట్లనే సీమాంధ్రుల రాజీనామాలతో తెలంగాణ ప్రకటన వెనక్కిపోవడం తనను తీవ్రంగా కలచివేసింది. తెలంగాణ రాదేమోనన్న ఆందోళన అప్పట్నుంచే ఆమెలో మొదలైంది. చివరకు తెలంగాణ కోసం చావడానికే సిద్ధపడింది.
అవును మరి. ఆ రోజు జనవరి 10, 2010. జేఏసీ జాతీయ రహదారుల దిగ్భందనానికి పిలుపునిచ్చిన రోజు. తోటి విద్యార్థులతో కలిసి సువర్ణ కొత్తకోటలో ఈ కార్యక్రమంలో పాల్గొంది. అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చింది. ఏం ఆలోచించుకుంట వచ్చిందో ఏమో, ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిలువునా కాలిపోయి, రాలిపోయింది.
అయితే, ఎందుకో అనడానికి గూడా ఏమీ లేదు. తాను స్పష్టంగా సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది. అందులో ‘‘అన్నయ్యా ... తెలంగాణ రాదేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ రాదని తెలిస్తే, అది విని నేను తట్టుకోలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటు న్నాను’’ అని సూటిగా తన బాధేమిటో చెప్పి మరీ వెళ్లిపోయింది.
అంతేకాదు, ‘‘అన్నయ్యలు, అక్కలు, తమ్ముళ్లు అందరూ కలిసి తెలంగాణ సాధించాలి. జై తెలంగాణ.’’ అని కూడా తన మరణ సందేశాన్ని చెప్పి పోయింది.
ఇంతటి త్యాగానికి ఒడిగట్టిన మన పాలమూరు బిడ్డ సువర్ణ తల్లిని కదిలిస్తే, ‘‘చిన్నప్పటి నుంచి సువర్ణ నాకు ఎంతో ఆసరాగా ఉండేది’’ అని కండ్లల్ల నీళ్లు తీసుకున్నది. ఒక్క క్షణం ఆగి, ‘‘ నాకు ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఇద్దరి బిడ్డల పెళ్ళి కష్టపడి చేసిన. చిన్నదైన సువర్ణను బడికి పంపిన. బాగా సదువుకొని పంతులమ్మ అవుతుందనుకున్న. కాని తెలంగాణ కోసం పాణమిడిసింది’’ అని బోరుమన్నది.
‘‘నాకు తెలంగాణంటే ఏందో తెలువదు. నా బిడ్డ చనిపోయినంకనే తెలిసింది. తెలంగాణను ఇస్తేనే నా బిడ్డ ఆత్మకు శాంతి చేకూరుతుంది’’ అని తన చీర కొంగుతో కండ్లు తుడుసుకుని నిశ్చయంగా చెప్పిందా తల్లి.
మరో శ్రీకాంత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి