5, ఆగస్టు 2013, సోమవారం

మన బొట్టు మన బోనం

మన బొట్టు మన బోనం
ఆషాఢం పూర్తయి, శ్రావణంలోకి అడుగిడుతున్న వేళ మన ఘనమైన బోనాల జాతర వైభవం ముగింపునకు చేరుకుంటున్నది. 
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండగ అనగానే మనకు గుర్తొచ్చేది లాల్ దర్వాజ వేడుక. లాల్ దర్వాజ సింహవాహిని శ్రీమహంకాళీ దేవాలయం. వందేళ్లకు పైగా ఘన చరిత్ర గలదీ ఆలయం. గోల్కొండ కోటలోని మైసమ్మ మాదిరిగానే సికింవూదాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయాలూ బోనాల వేడుకలకు పేరెన్నిక గన్నాయి.


bottubonamఅలాగే, కార్వాన్ దర్బార్ మైసమ్మ, మీరాలమండిలోని శ్రీ మహంకాళీ దేవాలయం, అక్కన్న మాదన్న మహంకాళీ ఆలయం, చార్మినార్‌వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం, ఉప్పుగూడలోని మహంకాళీ గుడి, లోయర్ ట్యాంక్ బండ్‌లోని కనకాల కట్టమైసమ్మ గుడి, బేగంపేటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయం, గౌలిపుర ద్వారం వద్ద గల మహంకాళీ మాతేశ్వరి వంటివి మొత్తం 100కు పైగా అమ్మవార్ల ఆలయాలు జంటనగరాలలో కొలువుదీరి ఉన్నాయి. ఈ బోనాల వేళ ప్రతీ ఒక్క గుడీ శోభాయమానంగా వెలిగిపోతుంది.
ఆనాడు నిజాం నవాబుల హయాంలోని మన హైదరాబాద్ నగరం చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడ ఉండేది. నగరం లోపలకు వెళ్లడానికి మొత్తం 14 ద్వారాలు ఉండేవి. ఆయా ద్వారాల వద్ద, నగరం లోపల వివిధ ప్రాంతాలలో వెలసిన అమ్మవార్ల గుళ్లు ఎన్నో.
ఇక్కడి హిందూ, ముస్లిం ప్రజల అన్యోన్య సహజీవనానికి గుర్తుగా ఆషాఢమాసంలో వచ్చే బోనాలు, ఇంచుమించు ఇదే సమయంలో నెలవంక దర్శనంతో వచ్చే రంజాన్ ఉపవాస వేడుకలు ఒక ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ రెండు పర్వదినాలు కలిసే సమయం చాలా అరుదుగా వస్తుంది. ఈసారి అంటే 33 సంవత్సరాల తర్వాత అటు బోనాలు, ఇటు రంజాన్ రెండు పండగలూ ఒకేసారి కలిసి వచ్చాయి. అందుకే, మన నగరాన్ని ఇప్పుడు ఆధ్యాత్మిక మేఘాలు కమ్ముకున్నాయి.

నిజాం నవాబుల పరిపాలనకు పూర్వం మన ప్రాంతాన్ని ఏలిన కాకతీయులు కూడా పలు రూపాల్లో ఆదిపరాశక్తిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతాపరుద్ర చక్రవర్తి ఆషాఢమాసంలో కాకతిదేవికి బలిపూజలు నిర్వహించేవాడని ప్రతీతి. ఈ ఉత్సవం చివరి రోజున అమ్మవారికి రాశులు రాశులుగా బోనాలను సమర్పించుకునే వారనీ చరివూతకారులు చెప్తారు. ఆ సందర్భంలో బోనాల వేడుకకు చిహ్నంగా ప్రజలందరికీ భారీ ఎత్తున అన్నదానం నిర్వహించేవారనీ తెలుస్తోంది.
గత నెల 11న గోల్కొండ వేడుకలతో జంటనగరాలలో అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు నెలరోజులపాటు అంటే ఆషాఢం పొడుగునా ప్రజలు ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జూలై 28న లష్కర్ (సికింవూదాబాద్) బోనాలు ముగిశాయి. కాగా, గత నెల 26 నుండి లాల్ దర్వాజ ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఒక అంచనా మేరకు దాదాపు రెండున్నర నెలల పాటు (ఆషాఢ, శ్రావణ మాసాలలో) ఈ బోనాల భక్తి సందళ్లు నెలకొంటాయి.

ప్రజలంతా ప్రగాఢంగా విశ్వసించే ఈ బోనాల ఉత్సవాలు శక్తి స్వరూపిణి అయిన ఆదిపరా శక్తి అమ్మవారు అవతారాలుగా భావించే వివిధ దేవతల ఆరాధనలో భాగంగానే జరుగుతాయి. యావత్ సృష్టికి తల్లి శక్తిస్వరూపిణి. మానవునికి శక్తినిచ్చేది ఆహారం. అది భోజనాల ద్వారానే మనకు సిద్ధిస్తుంది. అమ్మ భోజన స్వరూపిణి. భోజనం అంటేనే అచ్చ తెలుగులో బోనం అని అర్థం.
కొత్త కుండలో బియ్యం, పసుపు, పాలు, బెల్లం వేసి వండుతారు. ఆ కుండకు సున్నం, జాజుతో పూతలు పూసి, వేపకొమ్మలతో అలంకరిస్తారు. దానిపైన దీపం వెలిగిస్తారు. ఇలా తయారైన బోనాలను నిష్టాగరిష్టులైన మహిళలు భక్తిక్షిశద్ధలతో తలపై పెట్టుకుని అమ్మవారు ఆలయం దాకా మోసుకెళతారు. ఈ బోనాన్ని (నైవేద్యం) అమ్మవారికి సమర్పించి, మొక్కులు తీర్చుకుంటారు. గుడి ముందు పసుపు నీళ్లలో వేపాకును కలిపి సమర్పిస్తారు. మొదట్లో తాటికల్లు సమర్పించుకునే వాళ్లు. కానీ, కాలక్షికమేణా కల్లు స్థానంలో పసుపు నీళ్లు-వేపాకులతో కలిపి సమర్పిస్తున్నారు. అనేక గ్రామాలలో ఇప్పటికీ కల్లునే వినియోగిస్తున్నారు.

బోనాల పండుగ ప్రత్యేక ఆకర్షణ పోతరాజుల వీరంగం. పోతరాజు అంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమేరల నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, తర్వాత ఆమెను సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటాడు. ఏడుగురు అక్కాచెప్లూళ్లయిన అమ్మవార్లకు ఈ పోతరాజు అంటే అమితానందమని పెద్దలు చెప్తారు. పోతరాజు చేత కొరడా దెబ్బలు తింటే దుష్టశక్తులు ఆవహించవని భక్తుల విశ్వాసం.

బోనాల పండగ రోజున అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇళ్లలో తయారు చేసుకుని వాటిని బండ్లలో పెట్టుకొని గుడికి తెస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, వాటిలోని కొంత అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన వాటిని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులంతా మహావూపసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదాలు తెచ్చే బండ్లనే ‘ఫలహారాల బండ్లు’ అంటారు. అలాగే, బోనాల పండగలోని అత్యంత ఆసక్తికరమైన మరో ఘట్టం ‘రంగం’. మాతంగిగా భావించే స్త్రీ ఆ వేళ భవిష్యవాణిని తన నోటి వెంట వినిపిస్తుంది. దీనిపట్ల ప్రజలు ప్రగాఢమైన విశ్వాసం కనబరుస్తారు.
- ఎన్.వనిత విజయకుమార్,
హైదరాబాద్. 92460 62192

నమస్తే తెలంగాణా సౌజన్యంతో 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి