తెలంగాణ ఏర్పడితే భూమి బద్దలవుతుందా? సీమాంధ్ర సగటుపౌరుడు అన్యాయానికి గురవుతాడా? సీమాంధ్రకు నీళ్లు రావా? హైదరాబాద్ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్న నగరాలు సీమాంధ్రలో లేవా? తెలంగాణ విషయంలో ఏదైనా కదలికలు ఏర్పడితే.. గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎందుకు వరుసకట్టి తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు? నిజాలేంటి.. నిష్టూరాలేంటి? ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే తెలంగాణ సాధించే అభివృద్ధిని పక్కనపెడితే.. విభజనతో అత్యధిక లబ్ధి పొందేది ‘సీమాంధ్ర ప్రజలే’నన్నది తిరుగులేని వాస్తవం! కొత్త రాజధాని.. దాని నిర్మాణానికి అందే వేల కోట్ల నిధులు.. అంతిమంగా ప్రజల్లోకే ప్రవహిస్తాయి. రాజధాని ఏర్పడే సమీప జిల్లాలేకాకుండా.. ప్రధాన నగరాలుగా రూపుదిద్దుకునే అన్ని ప్రాంతాల్లోనూ భూములకు మహర్దశ పడుతుంది. కొత్తగా హైకోర్టు ఏర్పడుతుంది. ఐటీ పరిశ్రమ ప్రవేశిస్తుంది. ఫలితంగా ఇప్పటికే పెరుగుతున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. విభజన వల్ల ఉద్యోగాలు రెట్టింపు కావడంతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. విస్తారమైన తీర రేఖ ఉన్న కోస్తాంధ్రలో నెలకొల్పే థర్మల్ ప్రాజెక్టులతో గుజరాత్‌ను మించిన విద్యుత్ వెలుగులు వికసిస్తాయి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటై.. దుబాయ్, సింగపూర్ వంటి విదేశీ నగరాలకు కూడా నేరుగా ప్రయాణమార్గం ఏర్పడుతుంది. ఇప్పటికే ధాన్యాగారంగా భాసిల్లుతున్న జిల్లాలు.. సమీకృత కృషితో హరిత విప్లవాలకు నెలవవుతాయి. ఇక నీటిపంపకాల విషయమంటారా? అంతర్జాతీయ న్యాయసూత్రాలు.. జాతీయ ట్రిబ్యునళ్ల ఆదేశాల మేరకే జలాల పంపకం జరుగుతుంది కానీ.. ఎగువ రాష్ట్రం దయాదాక్షిణ్యాలపై కింది రాష్ట్రాలకు నీటి లభ్యత ఉండదన్నది జగమెరిగిన వాస్తవం! వెరసి.. ఈ విభజన వికాసానికే! విడిపోయి కలిసుండే రెండు తెలుగు రాష్ట్రాల ఐక్యత.. రెండు ప్రాంతాల ప్రజల అభివృద్ధికే! రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకే కాదు సీమాంధ్రకూ అనేక లాభాలు.. వాటిని స్థూలంగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. విజ్ఞులైన సీమాంధ్రప్రాంత ప్రజలు వీటిని స్వీకరిస్తారని ఆకాంక్షిస్తూ...
- సీఎల్ రాజం, సీఎండీ, నమస్తే తెలంగాణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి