20, సెప్టెంబర్ 2012, గురువారం

మార్చ్ వేదిక..ట్యాంక్‌బండ్!


kodan
- స్టీరింగ్ కమిటీ భేటీలో ఖరారు చేస్తామన్న కోదండరాం
- మార్చ్‌ను అడ్డుకునేందుకు పాలకుల కుట్ర.. సహించేది లేదు
- ప్రభుత్వమే బాధ్యతగా చర్యలు తీసుకోవాలి
- ఇంటికొకరు కదిలి మార్చ్‌ను విజయవంతం చేయాలి
- విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ పిలుపు 

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (టీ మీడియా) : తెలంగాణ మార్చ్ ఎక్కడ జరుగుతుందన్న ఉత్కం టీజేఏసీ తెరదించింది. వేదిక అంశాన్ని కొద్ది రోజులు రహస్యంగా ఉంచుతామని ప్రకటించిన టీజేఏసీ.. గతంలో మిలియన్ మార్చ్ జరిగిన ట్యాంక్‌బండ్ ఈ సారి కార్యక్షికమానికి కూడా వేదికగా ఉంటుందని పేర్కొంది. అయితే ఇంకా ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదని, స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఖరారు చేస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం బుధవారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. తెలంగాణ మార్చ్ ఎక్కడ నిర్వహిస్తున్నారని గవర్నర్ అడిగినప్పుడు ట్యాంక్‌బండ్ మీద అని చెప్పామని, తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపామని వివరించారు. తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వంలోని కొంత మంది కుట్రలు పన్నుతున్నారని కోదండరాం ఆరోపించారు. దీన్ని సహించేది లేదని హెచ్చరించారు. శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ను అసాంఘిక శక్తులతో దెబ్బతీసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

కొంత మంది ప్రభుత్వ పెద్దల మాటలు అందుకు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులపై కన్నేసి, ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ప్రతిష్టించే ముందు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దని సూచించిన కోదండరాం.. విగ్రహాల విషయాన్ని ప్రభుత్వ విజ్ఞతకే వదిలి వేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అమలుకు నోచుకోవడం లేదన్నారు. గుప్పెడు మంది తెలంగాణను అడ్డుకున్నారని, దీంతో తెలంగాణలో వేయి మంది బలిదానాలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని చెప్పారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని, ప్రతి ఇంటికొకరు కదలాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం అందరూ ఏకం కావాలని, ఒకే గొంతుకగా ఐక్యంగా కదలాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీశైలం భూనిర్వాసితులకు సచివాలయంలో ఉద్యోగాలను కల్పించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీజేఏసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాదు సత్యం పాల్గొన్నారు.

వివక్షల మధ్య ఎలా కలిసి ఉండాలి : శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణవారి పట్ల ప్రతినిత్యం సీమాంవూధులు చూపుతున్న వివక్షల మధ్య ఎలా కలిసి ఉండాలని టీజేఏసీ కోచైర్మన్ వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి, కర్నూలు జిల్లాలో పోస్టింగ్ ఇస్తే వారిని అక్కడి నుంచి తరిమి కొట్టడం పట్ల తీవ్రంగా స్పందించారు. మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగులకు సచివాలయంలో ఉద్యోగాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని లక్షలాది ఉద్యోగాలను కొట్టగొట్టిన సీమాంవూధుల పట్ల తామూ అదే పద్ధతిని అనుసరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని చాతకానితనంగా తీసుకోవద్దని ఆయన హెచ్చరించారు. అన్ని ప్రాంతాల ప్రజలను గౌరవించడమే తెలంగాణ సంస్కృతి అని ఆయన తెలిపారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరారు.

ఇది తెలంగాణ విముక్తి పోరాటం : ఆకుల భూమయ్య
తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు సాగుతున్నాయని, అందులో భాగంగానే తెలంగాణ మార్చ్ జరుగుతోందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎన్ని కుట్రలు పన్నినా, దిగ్బంధాలను సృష్టించినా వాటిని ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు ప్రజలు లక్షలాదిగా కదిలి రావాలని ఆయన కోరారు.

ఒకే గొంతుకగా కదులుదాం : విమలక్క
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు ఒకే గొంతుకగా కదులుదామని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క పిలుపునిచ్చారు. ప్రాంతం ఏదైనా పేదరికం ఒక్కటే అని అన్నారు. తెలంగాణ మార్చ్ కోసం రైతులను భారీగా కదలిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం కీలక మలుపు దశకు చేరుకుందని, అయితే కొంత మంది రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీ మంత్రులు తెలంగాణ ద్రోహులు : సంధ్య
తెలంగాణ ఉద్యమంలోకి కలిసి రాకుండా టీ మంత్రులు ద్రోహులుగా మారుతున్నారని పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు వీ సంధ్య అన్నారు. సీమాంధ్ర పాలకులకు తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధులు చెంచాగిరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ప్రజలు, పార్టీలు ఒక్కటయ్యాయని, ఇక కలిసి రావాల్సింది ఒక్క కాంగ్రెస్ నాయకులేనని ఆమె అన్నారు.

ప్రజల చేతుల్లోకి వెళ్లిన ఉద్యమం : వేదకుమార్
తెలంగాణ ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లిందని, రాజకీయ పార్టీలన్నీ కలిసి రాకుంటే వారికి భవిష్యత్తు ఉండదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు ఎం వేదకుమార్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఊసర రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజలతో కలిసి రావాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ తెలంగాణవాదులను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల అభివూపాయాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి