19, మార్చి 2012, సోమవారం

తెలంగాణకేది ‘ఉగాది’ సత్కారం?

తెలంగాణకేది ‘ఉగాది’ సత్కారం?

.........సీమాంధ్ర పైరవీకారులకే
పురస్కారాలు
- తెలంగాణ పండితులు,
... కవులు, కళాకారులకు అన్యాయం
- ఉగాది పురస్కారాల
ఎంపికపై వివాదం
హైదరాబాద్, : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రకటించే ఉగాది పురస్కారాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఈ పురస్కారాల్లో పైరవీకారులకే అగ్రతాంబూలం ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కనీస నియమ నిబంధనలు, వ్యక్తుల కీర్తివూపతిష్ఠలు, వారి విజయాలను పరిగణనలోకి తీసుకోకుండానే పురస్కారాల ఎంపిక జరుగుతున్నదని కవులు, కళాకారులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ పురస్కారాల విషయంలో తెలంగాణ కవులు, కళాకారులు, పండితులకు తీరని అన్యాయమే జరుగుతున్నది. ఉద్దేశపూర్వకంగానే వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా గతంలో ఏ గుర్తింపునకు నోచుకోని ఉన్నతమైన వ్యక్తులు, కళాకారులను ఉగాది పురస్కారాలకు ఎంపిక చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ, దీనిని కూడా పట్టించుకోవడం లేదని కళాకారులు, పండితులు, కవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు అందుకున్న పెద్దలకు మళ్లీ మళ్లీ అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్నారని విమర్శిస్తున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రిని, సెక్ర ఆ శాఖ అధికారులను ఒప్పించగల చాతుర్యమున్న పైరవీకారులకే ఉగాది పురస్కారాలు దక్కుతున్నాయనే విమర్శలున్నాయి.

పంచాంగ గణనలో ప్రతిభావంతురాలిగా పేరొందిన నందినీ గార్గేయ గత మూడు సంవత్సరాల నుంచి ఉగాది పురస్కారాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయినా ఆమెకు ప్రతిసారి మొండిచేయ్యే ఎదురవుతున్నది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండపల్లి శేషగిరిరావు, కాపు రాజయ్య, వైకుంఠం, వంటి చిత్రకారులు, జాతీయ స్థాయిలో హస్తకళలలో పురస్కారాలు అందుకున్న నిర్మల్ వెంకయ్య, తెలంగాణ కవులు, పండితులు అనేక సందర్భాలలో ఉగాది పురస్కారాలకు దరఖాస్తు చేసుకున్నారని, అయినా వారికి తిరస్కారమే ఎదురైందని తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి జూలూరి గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీమాంధ్ర పైరవీకారులు, వారి కబంధ హస్తాల్లోని కళాసంస్థలు సిఫారసు చేసిన వ్యక్తులకే పెద్దపీట వేస్తున్నారని, సాంస్కృతికశాఖలో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు సీమాంధ్ర అధికారులు ఉండటమే ఇందుకు కారణమని, వారు ఉద్దేశపూర్వకంగానే కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ పండితుల దరఖాస్తులను తొక్కి పెడుతున్నారని తెలంగాణ రచయితల వేదిక విమర్శించింది. సాధారణంగా పురస్కారాల ఎంపికకు ముందుగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే చిన్న నిబంధనను కూడా ఇప్పుడు పాటించడం లేదని, అప్పటికప్పుడు ఉన్నతాధికారులను మెప్పించిన వారికి ఉగాది పురస్కారాలు ప్రకటిస్తున్నారని తెలిపింది. భాషా సాహిత్య కళా రంగాలలో మహోన్నతమైన కృషి చేసి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు తెలంగాణలో ఎంతోమంది ఉన్నా, వారికి కూడాఉగాది పురస్కారాల్లో ప్రాధాన్యమివ్వడం లేదని ఈ ప్రాంత కవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సింహాచలం, అన్నవరం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, మహానంది, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ వంటి దేవస్థానాల నుంచి మాత్రమే వేద పండితులను ఎంపిక చేస్తున్నారని తెలంగాణ వేదపండితులను మాత్రం విస్మరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తెలంగాణలో జటాంతం, క్రమాంతం వరకు చదువుకున్న వేదపండితులు ఉన్నారని, అయినా వారిని గుర్తించి ఈ పురస్కారాలతో సత్కరించడం లేదని చెబుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి