6, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఎత్తున ఉంటే తెలంగాణకు నీళ్లు రావా?

ఎత్తున ఉంటే తెలంగాణకు నీళ్లు రావా?

 ‘తెలంగాణ ఎత్తు మీద ఉండటం మూలాన ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణకు నీళ్లు రావు’ అని సీమాంవూధవాదులంటున్నారు. ఇది ఎంత వరకు నిజం?

 -ఎ. రచన, సికింద్రాబాద్


ఇది పూర్తిగా అబద్ధం. తెలంగాణ ఎత్తుపైన ఉండటానికి ఆంధ్రవూపదేశ్ విడిపోవడానికి సంబంధం లేదు. తెలంగాణ ఎత్తు మీద ఉండటమనేది భౌగోళిక, నైసర్గిక సమస్య. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర మూడు ప్రాంతాలున్నాయి. తెలంగాణతో పోలిస్తే కోస్తాంధ్ర దిగువన ఉండటం, సమువూదానికి దగ్గరగా ఉన్న మాట నిజం. రాయలసీమలో కొంత భాగం ఎత్తుపైన, మరి కొంత భాగం కొంత దిగువన ఉన్నది.

 తెలంగాణతో పోలిస్తే రాయలసీమ తక్కువ ఎత్తులో, కోస్తాంవూధకు ఎగువన ఉంది. కనుకనే గోదావరి, కృష్ణా నదుల నీరు తెలంగాణ నుంచి కోస్తాంవూధకు, కృష్ణా నది నుంచి పెన్నానదికి (రాయలసీమ) గ్రావిటీ మార్గంగా (వాలు మార్గం గా) ప్రవహిస్తాయి. అయితే రాయలసీమలో ఎత్తై ప్రదేశాలు లేకపోలేదు. ఉదాహరణకు అనంతపురం. ఈ జిల్లాకు నీరు చేరాలంటే కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నుంచి ఎగువ తుంగభద్ర కుడి కాలువ నుంచి గ్రావిటీ మార్గంగానైనా చేరాలి. లేక మన రాష్ట్రంలోని శ్రీశైలం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా ఎత్తిపోతల మార్గంగానైనా చేరాలి.

ఎప్పుడైనా ఎక్కడైనా పంట భూమితో పోలిస్తే నదులు దిగువనే (తక్కువ ఎత్తులో) ఉంటాయి. కాబట్టి పంట భూములకు నీరు చేరాలంటే నదులకు అడ్డుకట్టలు వేసి నీటిని ఎత్తుకు లేపి వాలు మార్గంగా, గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా (దీన్నే గ్రావిటీ) ప్రవహింప చేయవలసి ఉంటుంది. నదిలోని నీటిని ఏమేరకు ఎత్తవలసి ఉంటుందనేది నదీ పరిసరాలు, భౌగోళిక, భూగర్భ ఇంకా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద ఆనకట్టలు కొండల మధ్య నదికి అడ్డుగా విలసిల్లాయి. మన దేశంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, పంజాబ్‌లోని భాక్రా ప్రాజెక్టులు పెద్ద కాంక్రీట్, రాతి కట్టడాల ప్రాజెక్టులకు ఉదాహరణలు.

 చుట్టుపక్కల ఎత్తై కొండలు లేకపోతే, ఆనకట్టలు చాలా పొడవుగా మట్టి (Rock fill)తో కట్టడం, వరద ప్రవహించే భాగాన్ని కాంక్రీట్ లేక మేసనరీ (Masonary లేక రాతి కట్టడం)తో కట్టడం జరుగుతుంది. వీటికి ఉదాహరణలు శ్రీరాంసాగర్, ఒరిస్సాలోని హీరాకుడ్. పెద్ద డ్యాంలు కట్టడానికి అవకాశం లేనిచోట నదులపైన చిన్న కట్టడాలు బ్యారేజీలు, ఏనీకట్ (Anicut)లు నిర్మిస్తారు. తీరాంధ్ర ప్రాంతంలో బ్యారేజీలను నిర్మించడం ఆనవాయితీ. మంజీరాపై కట్టిన ఘనపురం ఏనీకట్, కోస్తాంవూధలో నిర్మించి న ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు వీటికి ఉదాహరణలు. డ్యాంలు నిర్మించడం మూలంగా ఏర్పడ్డ జలాశయాల్లో ఎక్కువ నీరు నిలువ చేయడం జరుగుతుంది. బ్యారేజీలు, ఏనీకట్‌లు నదీ మళ్లింపు కట్టడాలు (River Diver sion Structures). మామూలుగా కొన్ని రోజుల అవసరాలకు సరిపడా నీటిని మాత్రమే నిలువ చేయగల సత్తా వాటికుంటుంది.

 డ్యాంలో నిలువచేసే నీరు ‘బిందె’ అనుకుంటే, బ్యారేజీ, ఏనీకట్‌లో నిలువచేసే నీరు ‘గిన్నె’ లేక ‘గ్లాసు’ అనుకోవాలి. చెప్పొచ్చేదేమంటే నదిలోని నీటిని నిలువ చేయాలంటే చిన్నదో, పెద్దదో కట్టడం కావాలి. ఆ కట్టడంలో నిలువచేసే నీటి స్థాయి (Elevation) కంటే పంటభూమి స్థాయి (Elevation) దిగువన ఉంటేనే గ్రావిటీ మార్గంగా నీరు చేరుతుంది. లేకపోతే నీటిని ఎత్తిపోతల ద్వారా పంట భూముల స్థాయికి చేర్చవలసుంటుంది.

ఆంధ్రవూపదేశ్ సమైక్యంగా ఉన్నా, తెలంగాణ ఏర్పడ్డా నదులస్థాయి, పంట భూములస్థాయి మారదు. కనుక తెలంగాణ వస్తే నీళ్లు అందవు అన్న మాట లు తెలంగాణ వ్యతిరేకులు మాట్లాడుతున్న అబద్ధాలు. అయితే తెలంగాణలోని నదీ జలాల, పంట భూములు, నీటి నిలువ చేయగల కట్టడాల పరిస్థితిని అర్థం చేసుకోవలసి ఉంటుంది. తెలంగాణకు (ఆ మాటకొస్తే మొత్తం రాష్ట్రానికి) జలసిరిని అందించే పెద్ద నది గోదావరి. దీనిపైన శ్రీరాంసాగర్ కట్టడం ఉంది. అక్కడి నుంచి కాలువ లు, గ్రావిటీ మార్గంగా నీటిని చేరవేస్తున్నాయి. ఉప నదులైన మంజీరాపై సింగూరు, నిజాంసాగర్, కడంపైన కడం డ్యాంలు నిర్మితమైనయి. ఇవి కూడా వాలు మార్గంగా నీటిని అందిస్తున్నా యి. ప్రధాన గోదావరిపైన శ్రీరాంసాగర్‌కు దిగువన ‘ఇచ్చంపల్లి’ పెద్ద ఆనకట్టకు అవకాశముండె.

 కానీ అంతర్‌రాష్ట్ర ముంపు సమస్యల మూలంగా అది కట్టడానికి పొరుగు రాష్ట్రాలు ఒప్పకోకపోవడం వల్లనైతేనేం, మన ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను ఒప్పించలేకపోవడం వల్లనైతేనేం ఇచ్చంపల్లి మరుగున పడింది. కనుక ఇంకే ‘డ్యాం’ సాధ్యపడటం లేదు. కాబట్టి కడుతున్న, కట్టబోయే ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతలే. అంటే నదిలో చిన్నవో, ఓ మోస్తరువో కట్టడాలు నిర్మించి, కొంత నీటిని నిలువచేసి, పంపుల ద్వారా నీటిని కాలువలు, సొరంగాల ద్వారా పంట భూములకు చేరవేయడం. ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గోదావరిపైన నిర్మిస్తున్న ఎల్లంపల్లి, దేవాదుల, దుమ్ముగూడెం, రాజీవ్ సాగర్ స్కీం, ఇందిరాసాగర్, రుద్రంకోట స్కీం, నిర్మింప తలపెట్టిన ప్రాణహిత-చే దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్, కంతనపల్లి అన్నీ కూడా ఎత్తిపోతల పథకాలే.

 వీటికి విద్యుత్తు, నీటిని మార్గ మధ్యంలో నిలువచేయగల బ్యాలెన్సింగ్ జలాశయాలు అవసరమవుతాయి. తెలంగాణ గోదావరి నదిలోని 80 శాతం పరీవాహక ప్రాంతాన్ని, కృష్ణలో 68.5 పరీవాహక ప్రాంత శాతాన్ని ఆక్రమించుకుని ఉంది. గోదావరిలో పుష్కలంగా నీరుంది. గోదావరి నీటిని ఉపయోగించుకోవడానికి సంసిద్ధంగా తెలంగాణలో సారవంతమైన భూములున్నాయి. సమస్య ఒక్కటే. Elevation అంటే పంటభూములు ఎత్తున ఉండటం. కనుక నీటిని నది నుంచి ఎత్తిపోతల ద్వారా భూములకు చేర్చడం మినహా మరో మార్గం లేదు. గోదావరితో పోలిస్తే కృష్ణానది కాస్తా మెరుగు. కాకపోతే అక్కడి సమస్య నీటి కొరత. గోదావరిలో మన (రాష్ట్ర) వాటా1480 టీఎంసీలు, కృష్ణలో 811 టీఎంసీలు. గోదావరి నీటిని యాభై శాతం మాత్రమే వినియోగించుకున్నాం.

 కృష్ణలో నీటిని పూర్తిగా వినియోగించుకున్నాం. ఇక కృష్ణలో ఉపయోగించుకోవడానికి నికర జలాలు లేవు. ఉంటేగింటే మిగులు జలాలే. వాటిపైన హక్కును ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం కృష్ణా నదిపైన జూరాల, నాగార్జునసాగర్ డ్యాంల నుంచి తెలంగాణకు నీరు గ్రావిటీ మార్గంగా చేరుతోంది. తుంగభద్ర పైన కట్టిన రాజోలిబండ, మూసీపైన మూసీ ప్రాజెక్టు, డిండీపైన డిండీ ప్రాజెక్టు నుంచి కూడా ప్రవాహ మార్గంగా నీరు పొలాలకు చేరుతోంది. కోయిల్‌సాగర్, నెట్టంపాడు, కల్వకుర్తి పథకాలు ఎత్తిపోతలపై ఆధారపడ్డాయి. అవి నిర్మాణంలో ఉన్నాయి.

 ఇక ‘ఎత్తిపోతల’ విషయానికి వస్తే నాగార్జునాసాగర్‌లో నిలువచేసిన నీటిని ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్‌కు తాగునీటి కోసం అందిస్తున్న విష యం తెలిసిందే. (మంజీరా నదిపైన నిర్మించిన సింగూరుకు అదనంగా) ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ఎత్తిపోతల ద్వారా కొంత మేరకు అందిస్తున్నారు. ఇక ఎత్తిపోతల సాధ్యాసాధ్యాల విషయానికొస్తే ఒకప్పుడు ఎత్తిపోతల ద్వారా నీటిని సాగు ప్రయోజనాలకు వాడటం అనేది ఊహలకందని విషయం. కానీ సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో అదిప్పుడు తేలిగ్గా సాధ్యపడుతోంది.

అమెరికాలో Central Ariyona ప్రాజెక్టు అనే భారీ సాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. ఆ ప్రాజెక్టు ద్వారా 65 టీఎంసీల నీటిని (మూడువేల క్యూసెక్కులు) 333 మైళ్ల దూరంలో రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల ఎత్తుపైన ఉన్న క్షేత్రాలకు చేరవేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇప్పు డు విజయవంతంగా పని చేస్తున్న ఎత్తిపోతల పథకం ఎఎంఆర్‌పి (ఎలిమినేటి మాధవడ్డి పథకం) ద్వారా 22 టీఎంసీల (600 క్యూసెక్కుల) కృష్ణా నీటిని సుమారు 100 మీటర్ల ఎత్తుకు చేరవేస్తున్నారు. పాక్షికంగా పూర్తయిన మరో పథకం దేవాదుల. ఈ పథకం ద్వారా 38.16 టీఎంసీల గోదావరి నీటిని 70మీటర్ల స్థాయి నుంచి 581 మీటర్ల స్థాయి వరకు అంటే 511 మీటర్ల ఎత్తుకు చేరవేసి 6,20,000 ఎకరాలను సాగుచేసే ప్రణాళికకు ప్రణాళికా సంఘం ఆమోదముద్ర వేసింది.

 ఇదే విధంగా రాయలసీమలో హంద్రీనీవా కూడా ఓ భారీ ఎత్తిపోతల పథకం. ఇది నిర్మాణంలో ఉంది. ఈ పథకం ద్వారా కృష్ణా వరద లేక మిగులు జలాలను (40 టీఎంసీలు) 565 కిలో మీటర్లు, 340 మీటర్ల ఎత్తుకు చేరవేసే ప్రణాళిక ఉంది. నిర్మాణం తలపెట్టిన మరో భారీ పథకం ప్రాణహిత-చే ఎత్తిపోతల పథకం. ఇది అమలు అయ్యాక తెలంగాణలోని 16 లక్షల 40 వేల ఎకరాలు సాగవుతుంది. ఈ పథకం ద్వారా 160 టీఎంసీల నీటిని 140 మీటర్ల స్థాయి నుంచి 580 మీటర్ల స్థాయికి ఎత్తిపోస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో కృష్ణానది మిగులు లేక వరద జలాలు వాడుకోవాలన్నా, గోదావరిలో నికర, మిగులు, వరద జలాలు వాడుకోవాలన్నా ఎత్తిపోతలు తప్ప ఇంకోదారి లేదు. నీటి అమలు కోసం విద్యుత్తు, నీటిని నిలువ చేసుకోవడానికి జలాశయాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చెరువులు వగైరా అవసరమవుతాయి.

 కనుక మనముందున్న తక్షణ కర్తవ్యం ఏమంటే గోదావరిలో పుష్కలంగా లభించే జలాలను ఏ విధంగా తక్కువ ఖర్చుతో రైతులకు భారం కాకుండా తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయగలం అన్నది. ఇది ఛాలెంజ్‌గా తీసుకుని తెలంగాణ ఇంజనీర్లు, రైతులు, ప్రజావూపతినిధులు నడుం బిగించవలసి ఉంటుంది.

 ప్రాజెక్టులు-ముచ్చట్లు
సాగునీటి ప్రాజెక్టులలో మూడు రకాలు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా. 25 వేల ఎకరాలకు పైబడి సాగు కల్పించే ప్రాజెక్టు భారీగా, ఐదు వేల ఎకరాల నుంచి 25 వేల ఎకరాలకు లోబడి సాగు కల్పించే ప్రాజెక్టు ను మధ్యతరహా, ఐదు వేల ఎకరాల కన్నా తక్కువ సాగు కల్పించే ప్రాజెక్టును చిన్నతరహా ప్రాజెక్టుగా వ్యవహరిస్తున్నారు.

కుంటలు, చెరువులు, బోరుబావులు వగైరా చిన్నతరహా కిందికే వస్తాయి. పెద్ద ప్రాజెక్టులలో నిలువ చేసే నీటిని టీఎంసీలలో కొలిస్తే (శత కోటి ఘనపు అడుగులు) చిన్న తరహా ప్రాజెక్టులలో నిలువ చేసే నీటిని మిలియన్ క్యూబిక్ ఫీట్లలో అంటే (పది లక్షల ఘనపు అడుగుల యూనిట్లలో)కొలుస్తారు.
జలాశయంలో నిలువచేసే పూర్తి నీటిస్థాయిని Full Reservoir Levelఅని, వరదలు వస్తే తాత్కాలికంగా నిలువరించే అత్యధిక నీటి స్థాయిని Maximum Reservoir Level అని అంటాం. చెరువులు, కుంటలలో వరద నీరుపోవడానికి ఏర్పాటు చేసే వ్యవస్థను ‘మత్తడి’ అన్నట్టే డ్యాంలలో వరదనీరు పోవడానికి ఏర్పాటయ్యే కట్టడాన్ని ‘స్పిల్ వే’ (Spill way)అంటాం.

 ఒక ప్రదేశం ఎంత ఎత్తులో (ELevation) ఉన్నది అని చెప్పడానికి మీటర్లు లేక అడుగులు వాడతాం. హైదరాబాద్ విమానాక్షిశయం 534 మీటర్లు అంటే సముద్ర మట్టానికి 534 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. శ్రీశైలం పూర్తి జలస్థాయి 885 అడుగులు అంటే సముద్ర మట్టంతో పోలిస్తే 885 అడుగుల ఎత్తన్న మాట. ఒకేస్థాయిలో రెండు బిందువులను కలిపే రేఖ కాంటూరులు. కాంటూరులు నిజంగా కనిపించే రేఖలు కావు. కేవలం ఊహాజనితం. ఒకే ఎత్తుపై ఉన్న ప్రదేశాలను సూచించే కాల్పనిక రేఖ మాత్రమే ‘కాంటూరు’.


 -ఆర్.విద్యాసాగర్‌రావు
 కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి