8, జనవరి 2016, శుక్రవారం

తెలంగాణ పల్లెలకు “కాకతీయ” తోరణం

Mission-Kakatiyaపోరుబాట వీడి…పొలంబాట పట్టాల్సిన తరుణమిది..బోర్ల ఎవుసం వీడి…చెరువుల నీళ్ళ సేద్యం చేయాల్సిన సమయమిది. సమస్త కోటి మనుగడకు కావాల్సిన మౌలిక అవసరం ఆహారం, కానీ ఆ ఆహారాన్ని పండించడానికి కావల్సింది నీరు. వ్యవసాయసాగుకు ఈ నీరు బావులద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో అతలాకుతలమైన చెరువుల వ్యవస్థ, నదీజలాల వ్యవస్థల ద్వారా తెలంగాణలో అతి తక్కువశాతం మాత్రమే సాగవు తుంది. ప్రస్తుతం తెలంగాణలో 81.05% సాగునీరు బావులద్వారానే అందుతుంది. చెరువుల ద్వారా కేవలం ఆరుశాతం మాత్రమే సాగవుతుంది. బృహత్ శిలాయుగం నుంచే మన పూర్వీకులు చెరువులను నిర్మించి, నీటిని నిల్వ చేసారనడానికి ఆధారాలెన్నో ఉన్నాయి. ఇంతటి చరిత్ర కలిగినవి కాబట్టే తెలంగాణ ప్రజల సంస్కృతి, జీవన విధానంలో చెరువులు భాగమయ్యాయి.
చెరువులు-తెలంగాణ సంస్కృతి
తెలంగాణను పాలించిన కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్‌జాహీలు దూరదృష్టితో నిర్మించిన చెరువులు తెలంగాణ ప్రజల సంస్కృతిలో, జీవన విధానంలో భాగమయ్యాయి. చెరువులకు, తెలంగాణ ప్రజలకు ఉన్న మైత్రిని చూస్తే తెలంగాణ మహోన్నతమైన సంస్కృతి ప్రతిబింబిస్తుంది. చెరువులను పూర్వం రాజులు, సైన్యాధ్యక్షులు, నాయకులు నిర్మించేవారు. ఇలా నిర్మించిన వారిని కథలద్వారాగాని, దేవాలయాల వద్దగానీ, పండగల సందర్భంలో గానీ ఆ గ్రామప్రజలు స్మరించు కుంటారు. సహాయం చేసిన వారిని ఎప్పటికి గుర్తుంచుకునే తెలంగాణ ప్రజల హృద్రత్వం దీంట్లో కనిపిస్తుంది. తెలంగాణలో ప్రతి నదిని, నీటి సమూహాన్ని గంగా అని పిలుస్తారు. అలాగే చెరువులను సైతం గంగాదేవిగా భావించి చెరువుకట్టలపై గంగాదేవి, కట్టమైసమ్మలాంటి విగ్రహాలు ప్రతిష్టించి ప్రతి ఏడు పండగలు చేస్తారు. మనకు బతుకుదెరువు చూపి స్తున్న నీటిని దేవతల రూపంలో పూజించడం మన ఉన్నత సంస్కృతికి అద్దంపట్టే చక్కని ఉదాహరణ.
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ పండగకు చెరువులకు అవినాభావ సంబంధం ఉంది. బతుకమ్మ పండగరోజు చెరువు దగ్గర జాతరలా ఉంటుంది. బతుకమ్మలో వాడే పూలు చెరువునీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా బతుకమ్మ కథలలో ఉన్న ఒక కథనం ప్రకారం చెరువుతెగడం వల్ల వస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపి గ్రామాన్ని కాపాడడానికి తన ప్రాణాలు త్యాగం చేసిన వీరవనితే బతుకమ్మ. కాబట్టి అలా గ్రామాన్ని కాపాడిన బతుకమ్మను యేటా స్మరించుకోవడం మన సంస్కృతిలోని గొప్పదనం. గ్రామంలోని చెరువు ప్రతి ఇంటికి అవసరమే. కాబట్టి గ్రామప్రజలు అందరూ కలసికట్టుగా చెరువు ను కాపాడుకుంటారు. ధనిక, పేద, కుల, మత భేదాలు లేకుండా శ్రమదానం చేసి చెరువును సంరక్షి స్తారు. తెలంగాణ పల్లెల్లో ప్రజల్లోని సంబంధాలు భారతదేశ విశిష్ట లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వా నికి చక్కని ఉదాహరణ. అంతేకాకుండా చెరువులు మత్సకారులు, గీతకార్మికుల జీవన విధానానికి ప్రతీక. చెరువులలో పెంచే చేపల అమ్మకంద్వారా మత్సకారులు జీవనం గడుపుతున్నారు. తమ బతుకుల్లో వెలుగులు నింపే ఆ చెరువులను గంగాదేవిగా భావించి ఆ గంగాదేవి పుత్రులుగా, గంగపుత్రులుగా వారిని పిల్చుకుంటు న్నారు. తమకు పట్టెడన్నం పెట్టే తమ కులవృత్తిని దానికి ఆధారమైన చెరువును దేవతగా, వారి తల్లిగా భావిస్తున్నారు. ఇలా మన సంస్కృతిలో, మన జీవన విధానంలో మిళితమైన చెరువులు ఉన్నతమైన మన సంస్కృతిని మహోన్నతంగా తీర్చిదిద్దాయి.
సకల ప్రాణులకు ఆధారం చెరువులే 
“చెరువు కింద ఎవుసం చేసి చెడినోడు లేడు”అనేది తెలంగాణలో నానుడి. దీనిని బట్టే వ్యవసాయానికి చెరువు ఎంతలా ఉపయోగపడు తుందో తెలుస్తుంది.
చెరువుల వల్ల కలిగే లాభాలను ఒకసారి పరిశీలిస్తే…
గ్రామంలోని చాలా పొలాలకు సాగునీరు అందిస్తాయి చెరువులు. నీరు నిల్వ ఉంచడం వల్ల గ్రామంలో భూగర్భజలాలు పెరుగుతాయి.
ప్రతి సంవత్సరం పూడిక తీసిన మట్టి, పొలాల్లో ఎరువుగా వేయడం ద్వారా భూములు సారవంతం అయ్యి దిగుబడి పెరు గుతుంది. ప్రస్తుతం సేంద్రీయ ఎరువుల వాడకంలో భాగం గారైతులు పశువుల పేడ కు ట్రాక్టర్‌కు రూ.700 నుండి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. కాని పూడిక మట్టి కేవలం రూ.200 నుండి రూ.300లలో లభిస్తుంది.
చెరువుల వల్ల మౌలికమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపుచేయడం, భూమికోతను నివారించడం.
కరువు సమయాల్లో కూడా లోతట్టు ప్రాంతా లకు సాగునీరు అందిస్తుంది. ప్రజల నీటి అవసరాలను, పశువుల దాహార్తిని తీరుస్తుంది.
మత్సకారులకు, గీతకార్మికులకు జీవనోపాధి కల్పిస్తుంది.
ఇన్ని లాభాలున్న చెరువులు గత పాలకుల అలసత్వం వల్ల నిర్లక్షం చేయబడి తమ వైభవాన్ని కోల్పోయాయి. చెరువుగట్టులు ఎక్కడికక్కడ తెగిపోయి, పూడిక తీయకపోవడం, మరమ్మత్తులు చేయకపోవడంవల్ల నీరు నిలవ చేసుకునే సామర్థం తగ్గిపోయి వాటి వాడకం క్రమంగా తగ్గిపోయింది. నాయకుల అలసత్వం వల్ల క్రమేణా ప్రజలు కూడా చెరువుల యొక్క శిఖం భూముల్ని వ్యవసాయానికి, ఇండ్లు కట్టడానికి వాడుకున్నారు. దీనివల్ల తక్కువ వర్షపాతం కలిగినటువంటి రెయిన్‌షాడో ప్రాంతంలో ఉన్న తెలంగాణ గొంతు ఎండింది, భూగర్భ జలాలు అడుగంటాయి, సాగునీరు కు బోరుబావులే దిక్కయ్యి, పేదరైతులు బోర్లు తవ్వించే స్థోమత లేక రైతుకూలీలుగా మారిన పరిస్థితి. గీతకార్మికులు, మత్సకారులు కులవృత్తిని, జీవనోపాధిని కోల్పోయి గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా నరకయాతన అనుభవిస్తున్నారు.
కృత్రిమ ఎరువుల వాడకం పెరిగి భూసారం తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో గిట్టుబాటు ధరలు లభించక రైతుల ఆత్మహత్యలకు దారితీసాయి. మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మకు తాత్కాలిక కుండీలు ఏర్పాటు చేసి నిమజ్జనం చేసుకునే దుస్థితి నెలకొంది.
మిషన్ కాకతీయతో మెరుగైన జీవితం 
కాకతీయుల కాలంనాటి గత రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన చెరువులను పునరుద్ధరించడానికి కెసిఆర్ నాయ కత్వంలోని తొలి తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే “మిషన్ కాకతీయ”పేరుతో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వెలవెల బోతున్న చెరువు గట్టులను మళ్ళీ సాంస్కృతి క వారధులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో ఉన్న 46,531 చెరువులను 5 దశలుగా 5 సంవత్సరాల్లో పునరుద్ధరించనున్నారు. దీనిలో భాగంగా చెరువుల పూడిక తీయడం, తూములను బాగుపర్చడం, చెరువు గట్టులను మరమ్మత్తుచేయడం లాంటివి చేసి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధ రిస్తారు. అంతేకాకుండా పూడిక తీసిన మట్టిన రైతులు ఎలాంటి రుసుం చెల్లించకుండా తీసుకెళ్ళ వచ్చు. దీనివల్ల భూసారం పెరిగి, దిగుబడులు పెరుగుతాయి.
చేయిచేయి కలుపుదాం
చెరువులను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ సంకల్పం గొప్పది. దీనికి ప్రజలందరు తమవంతు బాధ్యత నెరవేర్చాలి. “మన ఊరు – మన భవిష్యత్‌” అనే మిషన్ కాకతీయ శీర్షికలో మన తెలంగాణ ప్రజల భవిష్యత్తు కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ పనులలో చేయి చేయి కలిపి ఒక ఉద్యమంలా దీనిని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా కృషిచేయాలి. కృత్రిమ ఎరువుల వాడకం వల్ల చెరువులు కలుషితం అయ్యి నీరు వినియోగానికి పనికి రాకుం డా పోతుంది. అందుకే సేంద్రీయ ఎరువుల వాడకం పెంచి మన చెరువులను, భూగర్భ జలాలను సంరక్షించు కోవాలి. మనకోసం, మన భావితరాల కోసం చెరువులను, వాటిలో దాగి ఉన్న మన సంస్కృతిని కాపాడాలి. వాటర్ మ్యాన్ రాజేందర్‌సింగ్ లాంటి వాళ్ళు ఈ పథకాన్ని గొప్పగా అభివర్ణిస్తున్నారు. రాజేందర్ సింగ్ స్వయంగా వరంగల్‌జిల్లాలోని చెరువు గట్టుపై తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇంతటి అద్భుత పథకం ఈ మధ్యే మొదటిదశ పనులను దిగ్విజయంగా పూర్తిచేసుకుని రెండవ దశలో మరో పదివేల చెరువుల పునరుద్ధరణకై పరుగులు తీస్తుంది. ఈ దశ కూడా దిగ్విజయంగా పూర్తికావాలని కోరుకుందాం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి